ఇంటర్నెట్ డాక్టర్.. వైద్యమా.. వ్యాపారమా?..అసలు నిజమేంటి ?
తలనొప్పి వచ్చింది.. మొబైల్ డేటా ఆన్ చేసి గూగుల్‌లో సెర్చ్ చేస్తాం..
బరువు తగ్గాలనిపించింది.. జస్ట్ ఓ రీల్ చూస్తున్నాం..
షుగర్ వ్యాధి అదుపులోకి రావాలా? యూట్యూబ్ ఓపెన్ చేసి పరిష్కారం కోసం వెతుకుతున్నాం..
జుట్టు రాలుతోందా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరు మందు చెబుతున్నారు.ఉపయోగిస్తున్నాం
నెల రోజుల్లో 10 కిలోలు బరువు తగ్గిస్తామంటారు.షుగర్ వ్యాధిని మందులు లేకుండానే అదుపులోకి తెస్తామంటారు. ఒక్క పొడితో కీళ్ల నొప్పులు మాయం అంటారు. ఒక సీసాతో జుట్టు తిరిగి వస్తుందని హామీ ఇస్తారు.
డాక్టర్ కోటు ఉంటుంది. మెడలో స్టెతస్కోప్ ఉంటుంది. వెనుక వైద్యశాల లాంటి గది ఉంటుంది. వీడియోకు లక్షల వ్యూస్ కూడా ఉంటాయి.
కానీ ఒక చిన్న ప్రశ్న..
ఆ సలహా ఇస్తున్న వ్యక్తి నిజంగా వైద్యుడేనా?..
ఇప్పుడు ఈ ప్రశ్నను అడగాల్సిన అవసరం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆరోగ్య సమాచారం మాత్రమే కాదు..ఆరోగ్య భయాన్ని కూడా డబ్బుగా మార్చే ఒక భారీ డిజిటల్ వ్యవస్థ ఇపుడు వేగంగా పెరుగుతోంది.
2026 జూన్‌లో వెలువడిన మెకాఫీ ఆరోగ్యం సంక్షేమ పరిశోధన ఆధారంగా వచ్చిన నివేదిక ప్రకారం.. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 66 శాతం మంది ఆన్లైన్లో ఆరోగ్యానికి సంబంధించిన మోసపూరిత, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఏఐతో తయారైన కంటెంట్, నకిలీ ప్రశంసా పత్రాలు, ఇన్ఫ్లుయెన్సర్స్ పై ఉన్న నమ్మకం, ఆరోగ్య ధోరణులను మోసగాళ్లు ఉపయోగించుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది.
ఇది కేవలం తప్పుడు సమాచారం సమస్య కాదు.
ఇది నమ్మకం, భయం, అల్గోరిథమ్, ప్రకటన, వ్యాపారం…ఈ ఐదింటి కలయిక.
డాక్టర్ దగ్గరకు వెళ్లక ముందే మనం ఫోన్ ఎందుకు తెరుస్తున్నాం?..
ఇంటర్నెట్లో ఆరోగ్య సమాచారం వెతకడం తప్పు కాదు. సమస్య ఎక్కడ మొదలవుతుందంటే..సమాచారం కోసం చేసిన శోధన, స్వీయ నిర్ధారణగా మారినప్పుడు. స్వీయ నిర్ధారణ, స్వీయం చికిత్సగా మారినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది.
ఒక వ్యక్తికి తలనొప్పి ఉందనుకుందాం. దానికి నిద్రలేమి నుంచి కంటి సమస్యల వరకు అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఇంటర్నెట్లో లక్షణాలను వెతికినప్పుడు తీవ్రమైన వ్యాధుల గురించిన సమాచారం కూడా కనిపించవచ్చు. మరోవైపు, అదే లక్షణాన్ని చిన్న సమస్యగా చూపించే వీడియో కూడా కనిపించవచ్చు.
ఈ రెండు పరిస్థితుల్లోనూ ప్రమాదం..
మొదటిది అనవసరమైన భయాన్ని పెంచవచ్చు. రెండోది అవసరమైన వైద్య చికిత్సను ఆలస్యం చేయవచ్చు. ఇటీవల కాలంలో స్వీయ నిర్ధారణ ధోరణి పై వచ్చిన విశ్లేషణలు కూడా లక్షణాలు మాత్రమే పూర్తి వైద్య చిత్రాన్ని చెప్పలేవని, ఆన్లైన్ శోధనలు కొన్నిసార్లు సమయానికి వైద్య సేవలు పొందడాన్ని ఆలస్యం చేయవచ్చని హెచ్చరిస్తున్నాయి.
అంటే అసలు సమస్య ఇంటర్నెట్లో సమాచారం ఉండటం కాదు..
సమాచారాన్ని రోగ నిర్ధారణగా భావించడమే సమస్య.
లక్ష వ్యూస్ = నిజమైన వైద్య సలహా కాదు
సోషల్ మీడియాలో ఒక ప్రమాదకరమైన మానసిక సమీకరణ ఏర్పడుతోంది.ఇదే అత్యంత ప్రమాదకరం.
ఎక్కువ వ్యూస్ = ఎక్కువ నమ్మకం.
కానీ వైద్య శాస్త్రంలో ప్రజాదరణ ప్రమాణం కాదు.ఇది ప్రతి ఒక్కరూ బాగా గుర్తించుకోవాల్సిన విషయం.ఒక మందు పనిచేస్తుందా లేదా అన్నది వీడియో కింద ఉన్న లైక్‌ల సంఖ్య నిర్ణయించదు. ఒక చికిత్స సురక్షితమా కాదా అన్నది వ్యూస్ సంఖ్యతో తేలదు.
వైద్య సంబంధిత తప్పుడు సమాచారం సాధారణ తప్పుడు సమాచారంతో పోలిస్తే ప్రత్యేకంగా ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు. కారణం…దాన్ని సాధారణ వ్యక్తి గుర్తించడం కష్టం. అంతేకాదు, దాని ప్రభావం నేరుగా శారీరక ఆరోగ్యం పై పడే అవకాశం, ప్రమాదం ఉంటుంది. సోషల్ మీడియాలో ఆరోగ్య తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, అడ్డుకోవడం,దాని వ్యాప్తిని తగ్గించడం ఇప్పటికీ పరిశోధనలో పెద్ద సవాలుగా ఉంది. ఇక్కడే ఒక నమ్మలేని నిజం ఉంది
నిజమైన వైద్యుడు “పరీక్షలు చేయాలి, పరిస్థితిని బట్టి నిర్ణయించాలి” అంటాడు.
నకిలీ వైద్య గురువు “ఏడు రోజుల్లో ఫలితం” అంటాడు.
మొదటి మాట శాస్త్రీయంగా బాధ్యతాయుతమైనది. రెండో మాట సోషల్ మీడియాలో ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది.ఇక్కడే వైద్యం, వినోదంతో పోటీపడాల్సి వస్తున్న పరిస్థితి. ఇంటర్నెట్ డాక్టర్ వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే కేవలం కంటెంట్ క్రియేటర్‌ను మాత్రమే చూస్తే సరిపోదు. కంటెంట్ ఎలా ప్రయాణిస్తుందో కూడా చూడాలి.
ఒక వీడియో:
భయం కలిగిస్తే చూస్తాం.
ఆశ్చర్యపరిస్తే పంచుకుంటాం.
సులభమైన పరిష్కారం చెబితే భద్ర పరుచుకుంటాం.
“వైద్యులు ఈ నిజం చెప్పరు” అంటే మరింత ఆసక్తిగా చూస్తాం.అదే లక్షల్లో వ్యూస్ ఉంటుంది.
ఇక్కడ ఒక మానసిక బలహీనత పనిచేస్తోంది. క్లిష్టమైన సమస్యకు సులభమైన సమాధానం మనకు నచ్చుతుంది.బరువు తగ్గడానికి ఆహారం, నిద్ర, వ్యాయామం, ఆరోగ్య పరిస్థితి అన్నీ చూడాలి అనే సమాధానం కంటే…ఉదయం ఖాళీ కడుపుతో ఇది తాగండి” అనే సమాధానం వేగంగా వ్యాపిస్తుంది.
ఆరోగ్య తప్పుడు సమాచారం పై జరిగిన పరిశోధనలు, ఆన్లైన్ సమాచారం పై అధిక నమ్మకం ధృవీకరించని సమాచారాన్ని పంచుకోవడంతో సంబంధం కలిగి ఉండవచ్చని సూచించాయి. అందుకే ఇంటర్నెట్ డాక్టర్ సమస్యలో ఒక వ్యక్తిని మాత్రమే నిందించడం సరిపోదు.వీడియో తయారు చేసేవాడు ఉన్నాడు.దాన్ని పెంచే వ్యవస్థ ఉంది.
దాన్ని నమ్మే మనస్తత్వం ఉంది.
చివరిలో అమ్మడానికి ఒక ఉత్పత్తి ఉంది.
భయాన్ని ముందుగా అమ్ముతారు.. తర్వాత పరిష్కారాన్ని కూడా..
డిజిటల్ ఆరోగ్య వ్యాపార నమూనాలో తరచుగా కనిపించే పద్ధతి చాలా సులభం.మొదట మీలో ఒక భయాన్ని సృష్టించాలి.“మీ శరీరంలో ఈ ఐదు లక్షణాలు ఉంటే ప్రమాదం..“ఈ ఒక్క సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి..“మీరు రోజూ తింటున్న ఈ పదార్థమే మీ సమస్యకు కారణం.”అంతే…సింపుల్
వీడియో చివరికి వచ్చేసరికి పరిష్కారం సిద్ధంగా ఉంటుంది.ఒక పొడి, ఒక నూనె, ఒక మాత్ర, ఒక ఆన్లైన్ కార్యక్రమం లేదా చెల్లింపు సంప్రదింపు అంతే.ఇక్కడ ప్రశ్న ఆ ఉత్పత్తులన్నీ తప్పు అనేది కాదు. అలా అని శాస్త్రీయం కాదు.
అసలు ప్రశ్న:
సలహా వెనుక వైద్య ఆధారం ఉందా? లేక అమ్మకం లక్ష్యమా?
ఈ రెండింటి మధ్య గీత చెరిగిపోవడమే పెద్ద సమస్య.భారతదేశంలో చెల్లింపు ప్రచారాన్ని సహజమైన అభిప్రాయంగా చూపకుండా స్పష్టంగా గుర్తించాలనే ప్రకటన స్వీయ నియంత్రణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 2025లో మీడియా సంస్థల సామాజిక మాధ్యమ ఖాతాల్లో చెల్లింపు కంటెంట్‌ను స్పష్టంగా గుర్తించాలనే నిబంధనను ఏఎస్సీఐ తన నియమావళిలో చేర్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కానీ వినియోగదారుడి ముందు ఇంకా కీలకమైన ప్రశ్న మిగిలే ఉంది.
నేను చూస్తున్నది సలహానా? ప్రకటననా?
ఏఐతో సమస్య మరింత క్లిష్టమవుతోందా?
ఇప్పటి వరకు ఒక ఫేక్ హెల్త్ వీడియో తయారు చేయాలంటే కనీసం కెమెరా ముందు ఒక వ్యక్తి రావాల్సి ఉండేది.కానీ ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా పోయిన పరిస్థితి.
ఏఐతో ముఖాన్ని, గొంతును మార్చి నిజమైన వైద్యుడు చెప్పనివి చెప్పినట్లుగా చూపించే నకిలీ వీడియోల సమస్య ఇప్పటికే బయటపడింది.2025లో జరిగిన ఒక పరిశీలనలో నిజమైన వైద్యుల దృశ్యాలు, గొంతులను మార్చి, వారు నిరూపించని ఆరోగ్య ఉత్పత్తులను సమర్థించినట్లుగా నకిలీ వీడియోలు వ్యాప్తి చెందిన ఘటనలు చాలానే నమోదయ్యాయి.
దీని అర్థం ఏమిటి?
గతంలో మనం అడిగిన ప్రశ్న:
“ఈ వ్యక్తి వైద్యుడా?”
ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న:
“ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి నిజంగానే ఈ మాటలు చెప్పాడా?”
ఇదే ఇప్పుడు ఆరోగ్య సమాచార ప్రపంచంలో కొత్త ప్రమాదం.
ఇంటర్నెట్ డాక్టర్ ఎందుకు గెలుస్తున్నాడు..?
దీనికి కేవలం ప్రజల అమాయకత్వమే కారణమని చెప్పడం సమస్యను చాలా సులభంగా చూడటమే అవుతుంది.నిజమైన కారణాలు మరింత లోతుగా ఉన్నాయి.డాక్టర్‌ను కలవడానికి సమయం కావచ్చు. ఖర్చు ఉండవచ్చు. అపాయింట్మెంట్ అవసరం కావచ్చు. కొన్ని సందర్భాల్లో భాషా అంతరం ఉండవచ్చు.
కానీ ఫోన్లోని వ్యక్తి?
అతను 24 గంటలూ అందుబాటులో ఉంటాడు. మన భాషలో మాట్లాడతాడు. క్లిష్టమైన విషయాన్ని 30 సెకన్లలో చెబుతాడు. మన భయానికి వెంటనే ఒక పేరు పెడతాడు. తర్వాత ఒక పరిష్కారం కూడా చూపిస్తాడు.దీంతో ఇక్కడ సౌలభ్యం నమ్మకాన్ని గెలుస్తోంది.అయితే సౌలభ్యం, నైపుణ్యానికి ప్రత్యామ్నాయం కాదు.ఇదే ఇంటర్నెట్ డాక్టర్ విజయానికి మూల కారణం. అతను వైద్య వ్యవస్థలో ఉన్న ఖాళీని గుర్తించాడు.దీనికి పరిష్కారం…నమ్మదగిన వైద్య సమాచారం కూడా ప్రజలు ఉన్న వేదికల్లో, ప్రజలకు అర్థమయ్యే భాషలో అందుబాటులో ఉండాలి.
స్వీయ మందుల వినియోగం మరో హెచ్చరిక..
ఇంటర్నెట్లో చూసిన సలహా అక్కడితో ఆగిపోతే ఒక విషయం. అది మందుల వినియోగంగా మారితే సమస్య తీవ్రం కావచ్చు.2026లో చెన్నై ప్రాంతంపై వచ్చిన ఒక అధ్యయన నివేదికలో సర్వేలో పాల్గొన్న వారిలో 92.5 శాతం మంది కనీసం ఒక్క సారైనా సోంతంగా మందుల వాడినట్లు, వారిలో సుమారు మూడు వంతుల మంది వృత్తిపరమైన వైద్య సహాయాన్ని ఆలస్యం చేసినట్లు పేర్కొన్నారు.అయితే…ఈ ఫలితాలను కచ్చితంగా మొత్తం భారతదేశానికి వర్తింపజేయలేం; ఇది ఒక ప్రాంతీయ అధ్యయనం. అయినప్పటికీ సోంతంగా మందుల వినియోగం, వైద్య సహాయం ఆలస్యం మధ్య ఉన్న ప్రమాదకర సంబంధంపై ఇది హెచ్చరికగా చూడవచ్చు. ఇక్కడే బాధ్యతాయుతమైన విశ్లేషణ అవసరం.
ప్రతి ఆన్లైన్ ఆరోగ్య వీడియో ప్రమాదకరం కాదు.ఆరోగ్యం పై అవగాహన పెంచేవాడు మోసగాడు కాదు. ప్రతి సంప్రదాయ పద్ధతి పనికిరాదని కూడా చెప్పలేం.
అదే సమయంలో…
వ్యక్తిగత అనుభవం = వైద్య ఆధారం కాదు.
వైరల్ వీడియో = శాస్త్రీయ నిర్ధారణ కాదు.
లక్షల ఫాలోవర్స్ = వైద్య అర్హత కాదు.
తెల్ల కోటు = వైద్యుడనే ధ్రువీకరణ కాదు.
ఈ తేడాను గుర్తించడమే అసలు డిజిటల్ ఆరోగ్య అవగాహన.
ఎవరిని నమ్మాలి? ఐదు ప్రశ్నలు అడగండి…
ఆన్లైన్లో ఆరోగ్య సలహా కనిపించినప్పుడు వెంటనే నమ్మడం లేదా వెంటనే తిరస్కరించడం—రెండూ సరైన పద్ధతులు కావు.
ముందుగా ఈ ఐదు విషయాలను పరిశీలించాలి:
- సలహా ఇస్తున్న వ్యక్తికి సంబంధిత వైద్య అర్హత ఉందా?
- “100 శాతం నయం”, “ఏడు రోజుల్లో ఫలితం” వంటి సంపూర్ణ హామీలు ఇస్తున్నారా?
- సలహా చివర్లో ఒక ఉత్పత్తి కొనమని ఒత్తిడి చేస్తున్నారా?
- వ్యక్తిగత అనుభవాన్ని అందరికీ వర్తించే చికిత్సగా చూపుతున్నారా?
- తీవ్రమైన సమస్యకు వైద్యుడిని సంప్రదించకుండా మందులు ఆపమని లేదా మార్చమని చెబుతున్నారా?
ఈ ప్రశ్నల్లో హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే, ఆ సమాచారాన్ని వైద్య నిర్ణయానికి ఆధారంగా తీసుకోవడం ప్రమాదకరం కావచ్చు.
అసలు సమస్య ఇంటర్నెట్ కాదు.. నమ్మకం అమ్మకంగా మారడం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక కీలక సమస్యను గుర్తు చేస్తుంది: సమాచారం ఎక్కువగా ఉండటం మాత్రమే ప్రయోజనం కాదు; నిజమైన సమాచారం, తప్పుడు సమాచారం కలిసిపోయినప్పుడు ప్రజలకు నమ్మదగిన మార్గదర్శకత్వాన్ని గుర్తించడం కష్టమవుతుంది. ఇప్పుడు ఆరోగ్య ప్రపంచంలో జరుగుతున్న మార్పు కూడా ఇదే.ఒకప్పుడు రోగి వైద్యుడి దగ్గరకు వెళ్లి ప్రశ్న అడిగేవాడు.ఇప్పుడు రోగి ముందుగా ఇంటర్నెట్లో సమాధానం వెతికి, తర్వాత వైద్యుడి దగ్గరకు వెళ్తున్నాడు. కొన్ని సందర్భాల్లో అసలు వెళ్లకపోవచ్చు కూడా.అయితే ఈ మార్పును ఆపడం సాధ్యం కాదు.కానీ దాన్ని అర్థం చేసుకోవడం అవసరం.
ఫోన్లో సమాచారం ఉండొచ్చు.. వైద్యం మాత్రం వ్యక్తిగతం
ఇంటర్నెట్ ఆరోగ్య రంగానికి శత్రువు కాదు. సరైన సమాచారం అందితే అది ప్రజలకు అవగాహన కల్పించగలదు. లక్షణాలను గుర్తించడంలో సహాయపడగలదు. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలో తెలియజేయగలదు.కానీ సమస్య అక్కడే మొదలవుతుంది
సమాచారం నిర్ధారణగా మారినప్పుడు…
ప్రచారం వైద్య సలహాగా మారినప్పుడు…
ప్రభావశీలుడు నిపుణుడిగా కనిపించినప్పుడు…
భయం ఒక ఉత్పత్తి అమ్మే సాధనంగా మారినప్పుడు…
అప్పుడు ఇంటర్నెట్ డాక్టర్ ఒక సమాచార వనరు కాదు. అతను ఒక వ్యాపార నమూనాగా మారే ప్రమాదం ఉంది.
చివరికి ప్రశ్న ఒక్కటే:
మన ఆరోగ్య నిర్ణయాన్ని వైద్య ఆధారం నడిపిస్తుందా? లేక మనం చూసే తదుపరి వైరల్ వీడియో నడిపిస్తుందా?
ఆ సమాధానం మన చేతుల్లోనే ఉంది.నిర్ణయం తీసుకోవాల్సింది మనమే..!


