₹50 వేల జీతం.. అయినా డబ్బు ఎందుకు మిగలడం లేదు..?
జీతం వచ్చిన రోజు బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే కనిపిస్తుంది.కొండంత ధైర్యం వస్తుంది.కానీ ఆ ఆనందం, ధైర్యం ఎక్కువ రోజులు ఉండదు.ఇంటి అద్దె..ఈఎంఐ ఆంటూ వెళ్లిపోతుంది.పిల్లల స్కూల్ ఫీజు సిద్ధంగా ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లు ఎదురుచూస్తుంటుంది. కిరాణా, పెట్రోల్, కరెంట్, ఇంటర్నెట్ బిల్లు.. ఒక్కొక్కటిగా జీతాన్ని పంచుకుంటాయి.నెలాఖరుకు వచ్చేసరికి మిగిలేది ఒకటే ప్రశ్న.“అసలు నా జీతం ఎక్కడికి పోయింది?” ఆంటూ బుర్ర గోక్కుంటూ చేసేది లేక అవసరానికి అప్పులు చేస్తూ బ్రతుకును వెళ్ళదీస్తున్న పరిస్థితి.ఇది ఓ సామాన్యుడి పరిస్థితి..! గతంతో పోలిస్తే జీతాలు పెరిగాయి కదా అంటే..నిజమే జీతాలు పెరిగాయి.కానీ మన జీవితంలో ఖర్చు చేయాల్సిన మార్గాలు అంతకంటే వేగంగా పెరిగాయి. ఒకప్పుడు విలాసంగా కనిపించిన కొన్ని వస్తువులు ఇప్పుడు అవసరాలుగా మారాయి. ఈఎంఐలు భవిష్యత్తు జీతాన్ని ముందుగానే బుక్ చేస్తున్నాయి. సోషల్ మీడియా మన అవసరాల నిర్వచనాన్ని మార్చుతోంది.
జీతం పెరిగింది.. కానీ మన ఆర్థిక స్వేచ్ఛ కూడా పెరిగిందా..?
ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే మధ్యతరగతి జీవితంలో మారిపోయిన ఒక పెద్ద లెక్క కనిపిస్తుంది.వచ్చిన జీతం.. నిజంగా మన చేతిలో ఎంత? నెలకు రూ.50 వేల జీతం..ఏడాదికి రూ.6 లక్షలు..కాగితం మీద చూస్తే మంచి ఆదాయమే అనిపిస్తుంది.కానీ కుటుంబ జీవితం వార్షిక జీతంతో నడవదు.ప్రతి నెల వచ్చే బిల్లులతో నడుస్తుంది.
కొన్ని సంవత్సరాల క్రితం ₹50 వేల నెల జీతం మధ్యతరగతి కుటుంబానికి మంచి ఆదాయంగా కనిపించేది.ఇప్పుడు అదే జీతంలో ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, ఇంటర్నెట్, మొబైల్ రీఛార్జ్, పెట్రోల్, కిరాణా, పిల్లల చదువు, వైద్య ఖర్చులు, ఇన్సూరెన్స్, EMIలు అన్నీ నిర్వహించాలి.ఒక్కో ఖర్చు చిన్నదిగానే కనిపిస్తుంది.కానీ అన్నీ కలిపి చూస్తే జీతంలో పెద్ద భాగం మన చేతికి రాకముందే ఎక్కడికి వెళ్లాలో నిర్ణయమైపోతుంది.సమస్య ఒక్క పెద్ద ఖర్చు కాదు.కనిపించకుండా పెరిగిన వంద చిన్న ఖర్చులు.
₹50 వేల జీతం ఎలా మాయమవుతోంది?..
ప్రతి మధ్య తరగతి కుటుంబాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇదే…!.వచ్చిన జీతం మన కళ్ళ ముందే ఎటు వెళ్ళిపోతుంది అని.ఓ మధ్య తరగతి కుటుంబం సీటీలో బ్రతకలాంటే..ఇంటి అద్దెకు ₹12,000..కిరాణా, పాలకు ₹7,000..పెట్రోల్ లేదా ప్రయాణానికి ₹4,000.కరెంట్, మొబైల్, ఇంటర్నెట్‌కు ₹3,000..EMIలకు ₹10,000.పిల్లల చదువు లేదా కుటుంబ అవసరాలకు ₹5,000.మెడికల్, బయట భోజనం, చిన్నచిన్న కొనుగోళ్లకు మరో ₹5,000..మొత్తంగా ₹46,000.ఇంకా అనుకోని ఖర్చు రాలేదు. పండుగ రాలేదు. ఇంట్లో ఫంక్షన్ రాలేదు. బైక్ రిపేర్ కాలేదు. ఆస్పత్రికి వెళ్లలేదు.ఒకవేళ ఆనుకోని ఆర్థిక సమస్య ఏదైనా వస్తే..ఇక అంతే.
EMI: భవిష్యత్తు జీతాన్ని ఈరోజే ఖర్చు చేస్తున్నామా? ఆలోచించండి..?
ఇప్పుడు ఏదైనా కొనాలంటే డబ్బు మొత్తం చేతిలో ఉండాల్సిన అవసరం లేదు.
ఫోన్ EMI..బైక్ EMI..కారు EMI..పర్సనల్ లోన్ EMI..క్రెడిట్ కార్డు EMI.ఒక్కో EMI ₹2,000 లేదా ₹3,000 మాత్రమే అని అనిపించవచ్చు.కానీ ఐదు చిన్న EMIలు కలిస్తే నెల జీతంలో పెద్ద భాగం కనిపించకుండా పోతుంది.ఇది మరిచిపోయి EMIలతో వస్తువులు కొనేస్తూ మనకు మనమే ఆర్థిక భారాన్ని పెంచేసుకుంటున్నాం.EMI మన కొనుగోలు సామర్థ్యాన్ని పెంచినట్లు కనిపిస్తుంది. కానీ మరో వైపు అది రాబోయే నెలల జీతం పై ముందుగానే హక్కు తీసేసుకుంటుంది అన్నది మరిచిపోకూడదు..! ఎందుకంటే…జీతం ఇంకా అకౌంట్‌లో పడలేదు.కానీ దాన్ని ఖర్చు చేసే నిర్ణయం నెలల ముందే తీసుకున్నాం.ఇదే ఓ మధ్యతరగతి వ్యక్తి ఆర్థిక ఒత్తిడిలో కీలకమైన అంశం.
జీతం పెరిగితే సేవింగ్ ఎందుకు పెరగడం లేదు..?
₹25 వేల జీతం ఉన్నప్పుడు ₹5 వేల సేవింగ్ చేయలేకపోయాం. ₹35 వేలైంది.అప్పటికీ సేవింగ్ లేదు.₹50 వేలైంది.ఇప్పటికీ నెలాఖరుకు బ్యాలెన్స్ లేదు.ఎందుకు?..ఇది అందరూ ప్రశ్నించుకోవాలి.ముఖ్యంగా జీతంతో పాటు మన జీవనశైలి కూడా అప్‌గ్రేడ్ అవుతోందని మనం మరిచిపోయి ఖర్చులను పెంచేసుకుంటూ పోతున్నాం.మంచి ఫోన్ కావాలి.మంచి బైక్ కావాలి.వీకెండ్‌లో బయట భోజనం చేయాలి.OTT సబ్‌స్క్రిప్షన్లు కావాలి.ఆన్‌లైన్ షాపింగ్ సాధారణమైంది.ప్రతి అవసరం ఒక్కొక్కటిగా చూస్తే తప్పుగా కనిపించదు. కానీ ఆదాయం పెరిగిన ప్రతిసారీ…ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగితే ఆర్థిక స్వేచ్ఛ ఎప్పటికీ రాదు.ఆర్థిక స్వేచ్ఛ భవిష్యత్తులో ఇంకా ఎప్పటికి రానట్లే అన్నది గుర్తించుకోవాలి.
సోషల్ మీడియా కూడా మన ఖర్చులను నిర్ణయిస్తోందా..?
సాధారణంగా మనకు నిజంగా అవసరమైన వస్తువులు ఎన్ని ఇతరులను చూసి కావాలనిపించినవి ఎన్ని?సోషల్ మీడియాలో ప్రతి రోజు ఎవరో కొత్త ఫోన్ కొంటున్నారు. ఎవరో కొత్త కారు తీసుకుంటున్నారు. ఎవరో విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో ఖరీదైన రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నారు.కానీ మనకు కనిపించేది కేవలం వారి ఫోటో మాత్రమే.వారి EMI కనిపించదు.వారి అప్పు కనిపించదు.వారి బ్యాంక్ బ్యాలెన్స్ కనిపించదు.అయినా వారి జీవితంలోని హంగులు…హంగామా చూసి మన సాధారణ జీవితంతో వారితో పోల్చుకుంటాం.దీంతో మనజీవితం తలకిందులై పోతుంది.ఎందుకంటే…మన ఆదాయంతో జీవించడం తగ్గిపోయింది.ఇతరుల జీవితం చూసి మన ఖర్చులను నిర్ణయించడం పెరిగింది.ఇది మరిచిపోయి పక్కవాడి లగ్జరీ లైఫ్ చూసి మనం చేతులు కాల్చుకుంటున్నాం..!
మరి ఖర్చు తగ్గించుకుంటే సరిపోతుందా..?
చాలామంది బడ్జెట్ అంటే జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా ఉండటం అనుకుంటారు.అది ముమ్మాటికీ తప్పు.బడ్జెట్ అంటే ప్రతి రూపాయిని ఆపడం కాదు. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్లాలో ముందుగానే నిర్ణయించడం.జీతం వచ్చిన తర్వాత మిగిలినదాన్ని సేవింగ్ చేయడం చాలా మందికి పనిచేయదు.ఎందుకంటే సాధారణంగా ఏమీ మిగలదు కాబట్టి.అందుకే సేవింగ్‌ను కూడా ఒక ఖర్చులా ముందే పక్కన పెట్టాలి.ముందు సేవింగ్.తర్వాత అవసరమైన ఖర్చులు.ఆ తర్వాత lifestyle spending.ఈ కఠిన నియామాన్ని తు.చ. తప్పకుండా పాటించాలి.ఇలా సరైన నిర్ణయం తీసుకుకోకపోవడం వల్లే…₹50 వేల జీతం కూడా సరిపోని పరిస్థితి వస్తుంది.
సమస్య జీతంలోనా? మన నిర్ణయాల్లోనా?..
ద్రవ్యోల్బణం నిజం..ఇంటి అద్దెలు పెరిగాయి.విద్య, వైద్యం ఖరీదయ్యాయి.రోజువారీ అవసరాల ధరలు పెరిగాయి.కాబట్టి మొత్తం బాధ్యతను వ్యక్తిగత ఖర్చుల అలవాట్ల పై మాత్రమే వేయడం కూడా సరైంది కాదు.మనకు నియంత్రణ లేని ఖర్చులు ఉన్నాయి. అలాగే మనమే ఎంచుకున్న ఖర్చులు కూడా ఉన్నాయి.ఈ రెండింటినీ వేరు చేయకుండా ప్రతి నెలా “జీతం సరిపోవడం లేదు” అని మాత్రమే అనుకుంటే సమస్యకు పరిష్కారం కనిపించదు.నగరం మారితే లెక్క మారుతుంది.కుటుంబ బాధ్యతలు మారితే లెక్క మారుతుంది.అప్పులు ఉంటే లెక్క మారుతుంది.కానీ ప్రతి ఒక్కరూ తమను తాము అడగాల్సిన ప్రశ్న మాత్రం ఒకటే..!
నా జీతంలో నిజంగా నాది ఎంత?
జీతం ₹50 వేలా, ₹1 లక్షా అనేది ఒక్కటే ముఖ్యం కాదు.జీతం వచ్చిన తర్వాత మీ భవిష్యత్తు కోసం ఎంత మిగులుతోంది?అత్యవసర పరిస్థితి వస్తే అప్పు లేకుండా ఎదుర్కోగలరా?
మూడు నెలలు ఆదాయం లేకపోయినా నిలబడగలరా?ఈ ప్రశ్నలకు సమాధానం లేకపోతే సమస్య కేవలం జీతం మొత్తంలో లేదు.ఎంత సంపాదిస్తున్నామన్నది స్టేటస్‌ను చూపించవచ్చు.ఎంత నిలుపుకుంటున్నామన్నదే ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది.₹50 వేల జీతం సరిపోతుందా లేదా అన్నది ఒక్క సంఖ్యతో నిర్ణయించలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.. సమస్య మొత్తం జీతంలో లేదు, మన ఖర్చుల నిర్మాణంలో ఉంది.మనకు నియంత్రణలో ఉన్న ఖర్చులను గుర్తించడం, మనకు ఏది అవసరం ఏది అనవసరం అన్న తేడాను అర్థం చేసుకోవడం, EMIల పై ఆధారపడే జీవనశైలిని తగ్గించడం.. సేవింగ్‌ను ప్రాధాన్యంగా చూడటం— ఇవే నిజమైన మార్పుకు మొదటి అడుగులు.అలాగే జీతం పెరగడం కోసం ఎదురు చూడటం కంటే, ఉన్న జీతాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో మార్చడం ఎక్కువ ప్రభావం చూపుతుంది.చివరికి, ఆర్థిక స్వేచ్ఛ అనేది పెద్ద జీతంతో రాదు.సరైన నిర్ణయాలతో, క్రమశిక్షణతో, మరియు స్పష్టమైన ప్రాధాన్యతలతో వస్తుంది.మీ జీతం ఎంత అన్నది కాదు.మీ డబ్బు మీద మీకు ఎంత నియంత్రణ ఉందన్నదే అసలు విషయం.ఆప్పుడే మనం ఆర్థికంగా నిలదొక్కుకోగలం.హాయిగా జీవించ గలుగుతాం..!


